Thursday, 23 August 2018

మరిచి పోయావా నేస్తం

ఏరా  అని పలకరించే  నీ పిలుపు 
పొద్దుగూకినా వినబడలేదు
పదరా పోదామన్న పలకరింపు 
పదైనా కనబడలేదు 


నా భుజం మీద వెంట వచ్చే నీ చెయ్యి 

తడిమినా తగలకుంది 
ప్రేమగా  హత్తుకునే ఆప్యాయత 
అడిగినా  దొరకకుంది 

ఎటు పోయావు నేస్తం  ఏమైపోయావు 

వదిలి పెట్టి పోయావా విడిచెళ్ళిపోయావా 
ఎంతసేపు చూశానో ఎక్కడెక్కడ వెతికానో 
ఎవరిఎవరిని అడిగానో మరి మరి ఏమార్చిపోయానో 


తెలియలేదు ఎంత బాధో 

తడబాటు తాకి ఇంకెంత పెరిగిందో 
ఒక్కసారి వస్తావా నేస్తం 
కలిసి భోంచేసి కలిసెళ్లిపోదాము

మాటైనా చెప్పలేదు
మూటనూ కట్టలేదు
మాటలొద్దుకున్నావా నేస్తం
నను మరిచిపోయావా నేస్తం

ఒక్కసారి ఇటుగా  రావా
మళ్లీ మాటలు మూటలు కట్టావా నేస్తం
వేచిచూస్తూ ఉంటాను ... ఉంటాను !!

Monday, 15 May 2017

ఏ మనిషి చరిత్ర చూసినా


ఏ మనిషి చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం
ప్రతి వాడి గోడు సమస్తం పర పీడన, ఆలసత్వం


ఏడుపులు పెడ బొబ్బలనడుమన చిరునవ్వులు
నలిగే నరముల మధ్యన  మందుల ముచ్చట్లు
వెనుక చూచినా పరుల దుమ్మే
ముందు చూచినా  పరుల ఉమ్మే

నచ్చక మనసొప్పక
జీవనమే తలతిక్కని
తప్పించేవాడెవడని
పనులను పక్కకి పెట్టి

తనులను మరపున పట్టి
తెగ పీకి ఇరగతీద్దామని
ఇక తీరా ఆరా  తీస్తే
అసలు సొట్ట తెలిసింది

జబ్బు నా యందు జాడ్యమని
నాకున్న బుర్ర వాడనని
వాడెవడో పెడతాడని  వీడెవడో పొడుస్తాడని
అర్రులు చాచి బ్రతుకుతున్నానని


బుద్ధి మాంద్యము వదిలే దాకా
సుత్తి దెబ్బలు  మోహమునేసుకుని
కంపు చరిత్రను తగులబెట్టి
తెల్ల కాగితము చేత బట్టి

నన్ను నమ్ముకుని  శాయశక్తుల
వడలు వంచితె అన్ని వేళలా ...

మారబోదా  బురద రంగు
వదిలి పోదా మకిలి నన్ను
తెలవారెను హృదయమందు
దరికి చేరేను  జీవితంబు

--క మ ర