Monday 7 October 2019

మరణ వరం



వ్యధల వధలతో వడిలిపోయిన  వెర్రి మనసు
ముడతల ముసుగులో దాగిన మాసిన మోము
దాక్కుని తిరిగిన వదలని చిత్తము
ఆపుకు  అరిచిన ఆగని దుఃఖము

ఎవడు లేడంటు బుర్రెoత   చెప్పిన
వినని మనసుకిపుడు తాట లేచింది

ఒల్లుకుళ్లబొడిచే అరిగిన ఎముకలు
చేసిన చేష్టల చెప్పు దెబ్బలై
తోసిన తప్పులు తిప్పలు పెట్టగ
నొసటన చెయ్యి మరి మరి బాదగా


మంచిమిత్రులను ముంచిన తీరు
నను నేను చూస్తే ఆగని కన్నీరు
బలమున్నంత వరకు నేనే రాజంటు
బలుపు తీరాక బాధలేనంటూ

ఏడ్పుగొట్టు బ్రతుకయ్యిందని ఏడ్చి ఏడ్చి
మొదటి నుండి ఉన్న ప్రకృతి వంక చూసి
ఎదో ఒకటి చేసి ఈ గురుతు  యాతన తీర్చమని
దీనంగా అర్థించిన కనులకు

పడగలు విప్పి పురులని దాల్చి
వేప మండల గాలులు రేపి
ఎలుగెత్తి ఒక పాటున నింగి విరిచి
ఒసగినది ఈ మరణ వరం

--క మ ర





Wednesday 13 February 2019

కలిసి కట్టిన గూడు

వీడిపోని స్నేహామని ఊరంతా చెప్పేది
ఇంత ఆత్మీయత ఎక్కడా  లేదే అని నోరెళ్లబెట్టింది 
ఎంత ప్రేమో అని మెటికలెన్నో విరిగేవి 
అరికాలి లోన దిష్టిచుక్క కరిగేనేమో అనిపించేది   

ఇన్ని కళ్ళు మనకెందుకన్నావు 
కలిసి ఒక గూడు కడదామన్నావు 
పెంకులెన్నో తెచ్చాము తాటాకులు పేర్చాము 
సున్నాన్ని  అరగదీసాము మట్టికూడా తొక్కాము  

పక్కవూరిలో పనివాడు ఉన్నాడు 
మనఇంట్కి మంచి చేస్తాడు చూసివస్తానన్నావు 
తొక్కిన మట్టి ఎండకట్టిపోయింది 
పెంకులన్నీ బీటలు పట్టాయి 

మరొకడు వచ్చాడు వారం కలిసి తిరిగాడు 
ఊరంతా అదే మాట చెప్పింది 
ఈ సారి ఊరవతల వడ్రంగి అన్నాడు 
మరొక వారం చూసి ఆశ వదులుకున్నాను 


ఇంకెవరో ఇంకెవరో  వస్తూ పోయారు, ఊరు అదే సొల్లు చెప్పింది 
కంసాలి అన్నారు కుమ్మరి అన్నారు 
పదిరోజులన్నారు పక్షమన్నారు 
చీకటి పడేలోపు వస్తామంటూ నా కళ్ళు మూసారు 

నమ్మి నమ్మి నీరు గారి పోయాను 
నాఅంతట నేను గూడు కట్టదలచాను 
మట్టి తొక్కే నీళ్లలో కన్నీళ్లు కలిసాయి 
పగిలిన పెంకులు బాధతో అతికాయి 

రావన్న నమ్మకం పైకప్పు పేర్చింది 
ఎవరు లేరన్న శాశ్వతం గూడు  తలుపుగా మారింది  
లోపలికి వెళ్ళాను తలుపు మూసుకున్నాను 
ఎటు నుంచి వచ్చావో పరిగెత్తి వచ్చావు 

గబాలున ఘడియపెట్టి పరిగెత్తి పోయావు 
ఏడవాలన్న ఆలోచన రాలేదు 
బయటకంటె లోపలే నయమన్నఊసు  తప్ప
నీ తప్పు అనిపించలేదు 
ఇక మిగిలేది  ఇదే అన్న  ధ్యాస తప్ప 

ఈ కలసి కట్టిన గూడు లోన కలచి వేసిన గుదిబండనయ్యాను