Monday 15 May 2017

ఏ మనిషి చరిత్ర చూసినా


ఏ మనిషి చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం
ప్రతి వాడి గోడు సమస్తం పర పీడన, ఆలసత్వం


ఏడుపులు పెడ బొబ్బలనడుమన చిరునవ్వులు
నలిగే నరముల మధ్యన  మందుల ముచ్చట్లు
వెనుక చూచినా పరుల దుమ్మే
ముందు చూచినా  పరుల ఉమ్మే

నచ్చక మనసొప్పక
జీవనమే తలతిక్కని
తప్పించేవాడెవడని
పనులను పక్కకి పెట్టి

తనులను మరపున పట్టి
తెగ పీకి ఇరగతీద్దామని
ఇక తీరా ఆరా  తీస్తే
అసలు సొట్ట తెలిసింది

జబ్బు నా యందు జాడ్యమని
నాకున్న బుర్ర వాడనని
వాడెవడో పెడతాడని  వీడెవడో పొడుస్తాడని
అర్రులు చాచి బ్రతుకుతున్నానని


బుద్ధి మాంద్యము వదిలే దాకా
సుత్తి దెబ్బలు  మోహమునేసుకుని
కంపు చరిత్రను తగులబెట్టి
తెల్ల కాగితము చేత బట్టి

నన్ను నమ్ముకుని  శాయశక్తుల
వడలు వంచితె అన్ని వేళలా ...

మారబోదా  బురద రంగు
వదిలి పోదా మకిలి నన్ను
తెలవారెను హృదయమందు
దరికి చేరేను  జీవితంబు

--క మ ర

No comments: